Monday, September 21, 2026
Homeమెదక్అపశృతులకు తావులేకుండా వినాయక నిమజ్జనం నిర్వహించాలి

అపశృతులకు తావులేకుండా వినాయక నిమజ్జనం నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

బారికేడింగ్, లైటింగ్‌పై ప్రత్యేక దృష్టి • అత్యవసర సేవలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలి

రాయరావు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 20:

నర్సాపూర్ (19) వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. శనివారం నర్సాపూర్‌లోని రాయరావు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, బారికేడింగ్, లైటింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, రాత్రివేళల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చిన్న, భారీ వినాయక విగ్రహాలతో వచ్చే వాహనాలకు అవసరమైన చోట ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసి, బారికేడింగ్‌ను పటిష్ఠంగా చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు నిమజ్జన ప్రాంతంలోకి అనవసర వాహనాలను అనుమతించకుండా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిమజ్జన సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణమే స్పందించేలా జేసీబీలు, క్రేన్లు, అగ్నిమాపక వాహనాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. మత్స్యకారులు, గజ ఈతగాళ్లను షిఫ్టుల వారీగా విధుల్లో ఉంచి నిమజ్జన ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

యువతకు ఎస్పీ సూచనలు

అనంతరం నర్సాపూర్ పట్టణంలోని శివాజీ యూత్ గణేష్ మండపాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. మండపం వద్ద నిర్వహిస్తున్న పాయింట్ బుక్‌ను పరిశీలించి యువతతో మాట్లాడారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సూచించారు.

నిమజ్జన ఏర్పాట్లకు వినియోగించే వాహనాలు, యంత్రాలు, సిబ్బంది విధులకు సంబంధించిన వివరాలు, సిబ్బంది సంతకాలు, రోజువారీ రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రతి అంశాన్ని ముందుగానే పర్యవేక్షించాలని, సమష్టి కృషితో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా, ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు సందీప్ రెడ్డి, రంగకృష్ణ, ఎస్సై రంజిత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!