డ్రగ్స్, సైబర్ నేరాలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలి
నిజాంపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 27:
మెదక్ జిల్లా: పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ క్రమంలో మంగళవారం నిజాంపేట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజేష్ మొక్కను అందజేసి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని ఎస్పీ పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. కేసులకు సంబంధించిన వివరాలను సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య అప్లికేషన్లలో ఎప్పటికప్పుడు నమోదు చేసి అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ షీ టీమ్స్ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు (వి.పి.ఓ లు) ప్రతి గ్రామాన్ని సందర్శించి డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ప్రజల్లో మరింత చైతన్యం తీసుకువచ్చేందుకు కళాబృందాల సహకారంతో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమైన ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో సీఐలు సైదా, సందీప్ రెడ్డి, ఎస్‌ఐ రాజేష్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

