ఉపగ్రహ చిత్రాలతో భూ పటాలు.. పట్టాదారు పాస్ పుస్తకాల్లో పొందుపరిచేలా చర్యలు
తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే
డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు 15 రోజుల్లో పూర్తి చేయాలి
ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం.. రెండో పంట సాగుకు వెళ్లొద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి
A2న్యూస్, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 28 :
సంగారెడ్డి జిల్లా (27) రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం, భూ హక్కుల పరిరక్షణ, భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకతే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో ‘భూదార్’ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఉపగ్రహ చిత్రాలతో రూపొందించిన భూ పటాలను పట్టాదారు పాస్ పుస్తకాల్లో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రెవెన్యూ, స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భూభారతి చట్టం అమలు, భూ సర్వే, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు, రానున్న రోజుల్లో తలెత్తే తాగునీటి సమస్యలపై ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.
భూ రికార్డుల్లో పారదర్శకతకు భూభారతి
గతంలో ధరణి విధానంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపడంతోపాటు భూ పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నాయకత్వంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. భూముల హద్దులు, విస్తీర్ణం, రికార్డులకు సంబంధించి స్పష్టత తీసుకురావడంతోపాటు భూ యజమానుల హక్కులకు రక్షణ కల్పించేలా నిర్దేశిత లక్ష్యాల మేరకు సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఏడు ఉమ్మడి జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించామని, తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎనిమిదో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
అర్హులకు 15 రోజుల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు
గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే సుమారు 90 శాతం ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మిగిలిన ఇళ్ల కేటాయింపు ప్రక్రియను కూడా 15 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఎల్‌నినోతో నీటి ఎద్దడి ముప్పు
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సింగూరు వంటి ప్రాజెక్టుల్లో నీటి సమస్యలు ఎదురవుతున్నాయని, భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టుల్లోనూ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. కరువు పరిస్థితులు తీవ్రతరం అయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రెండో పంట సాగుకు అవసరమైన నీరు, విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా, నీటి లభ్యతే ప్రధాన సమస్యగా మారే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. నీటి ఎద్దడి సమస్య తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు పరిస్థితులను అర్థం చేసుకుని, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండో పంట సాగుకు వెళ్లకుండా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నీటి వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి కొరతపై ప్రజలకు, రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించడంలో ప్రతిపక్షాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కోరారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులను అందించి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రైతుల ప్రయోజనాలు, భూ హక్కుల పరిరక్షణ, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

