Wednesday, October 28, 2026
Homeమెదక్పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవు

పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవు

📰 Generate e-Paper Clip

భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

A2న్యూస్, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 28 :

సంగారెడ్డి జిల్లా (27)రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరుచుకుని బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రజల ముఖ్యంగా రైతుల భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని, భవిష్యత్తులోనూ పనితీరులో మార్పు రాకపోతే సంబంధిత అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, హౌసింగ్ శాఖల పనితీరుపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యల పరిష్కారం, భూ రికార్డుల నిర్వహణ, రీ సర్వే పురోగతి, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, కేటాయింపులపై అధికారులతో చర్చించారు.

రైతులకు భూమి విస్తీర్ణంపై స్పష్టత ఇవ్వాలి

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, సర్వేలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రీ సర్వే నిర్వహణపై పలువురు తహసీల్దార్లు, సర్వేయర్లతో మంత్రి ముఖాముఖి నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేకు కేటాయించిన గ్రామాలు, ఇప్పటివరకు పూర్తయిన సర్వే, రోజువారీగా సర్వే చేస్తున్న భూమి విస్తీర్ణం, పనులు పూర్తయ్యేందుకు పట్టే సమయం తదితర అంశాలపై ఆరా తీశారు. సర్వే సమయంలో ప్రతి రైతుకు తన భూమి విస్తీర్ణం, సరిహద్దుల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి సందేహాలు మిగలకుండా క్షుణ్ణంగా వివరించాలని, భూమికి సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు ప్రతి స్థాయిలోని రెవెన్యూ అధికారులు సర్వే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే పురోగతిని పరిశీలించడంతోపాటు రైతుల అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూములతోపాటు ఆబాదీ ఆస్తుల రీ సర్వేను ఏడాదిన్నరలోపు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందని వెల్లడించారు. ఈ గ్రామాల్లో పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

పెండింగ్ దరఖాస్తులకు తక్షణ పరిష్కారం

రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రైతులు, సామాన్య ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారమయ్యే వరకు విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇళ్ల నిర్మాణ సమయంలో లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు సిమెంట్ బస్తాను కేవలం రూ.230కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

వివిధ ప్రాంతాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులు పారదర్శకంగా, అర్హత ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సమీక్ష సమావేశానికి ముందు పలువురు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న భూ సమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు సంబంధించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను పరిశీలించిన మంత్రి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రజాప్రతినిధులు అందించిన సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేశ్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సంజీవరెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్ జైన్, హైమావతి, ప్రతిమా సింగ్‌లతోపాటు అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!