Wednesday, October 28, 2026
Homeమెదక్బాలికను మాయమాటలతో తీసుకెళ్లిన కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు

బాలికను మాయమాటలతో తీసుకెళ్లిన కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు

📰 Generate e-Paper Clip

30 వేల జరిమానా విధించిన ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు.. పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 28 :

మెదక్‌ (27) బాలికను మాయమాటలతో నమ్మించి వెంట తీసుకెళ్లిన కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 30 వేల జరిమానా విధిస్తూ మెదక్‌ జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

బాలికను వెంట తీసుకెళ్లిన యువకుడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను ఆమె తండ్రి 2025 అక్టోబర్‌ 14న హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కించారు. అయితే, వడియారం వద్ద బస్సు ఆగకపోవడంతో బాలిక చేగుంటలో దిగింది. ఈ క్రమంలో తనకు పరిచయమున్న ఆనంద్‌ (22) అనే యువకుడికి ఫోన్‌ చేసి, తాను చేగుంటలో ఉన్నానని, హాస్టల్‌ వద్ద దింపాలని కోరింది. అక్కడికి చేరుకున్న ఆనంద్‌ మాయమాటలతో బాలికను నమ్మించి, తనతో ఉంటే బాగా చూసుకుంటానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. మొదట బాలికను మేడ్చల్‌కు, అక్కడి నుంచి నిజామాబాద్‌కు తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్‌కు చేరుకుని, తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, బాలికను ఇంటికి పంపించాలని ఆనంద్‌ తల్లి సూచించడంతో అక్టోబర్‌ 15న రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరూ బస్‌స్టాండ్‌కు వెళ్లారు. అక్కడ తూప్రాన్‌ పోలీసు సిబ్బంది బాలికను గుర్తించి, భరోసా కేంద్రానికి తరలించారు.

పకడ్బందీగా దర్యాప్తు.. నిందితుడికి శిక్ష

ఈ ఘటనపై తూప్రాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో తొలుత మిస్సింగ్‌ కేసు నమోదైంది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు బాలికను గుర్తించి, తదుపరి దర్యాప్తును పకడ్బందీగా చేపట్టారు. కేసు దర్యాప్తు అధికారి ఎస్‌ఐ ఎన్‌. జ్యోతి అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బాలయ్య కోర్టులో బలమైన వాదనలు వినిపించగా, లీగల్‌ అడ్వైజర్‌ శ్వేత బాలిక సాక్ష్యం ఇచ్చేందుకు అవసరమైన సహకారం అందించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మెదక్‌ జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్‌.ఎం. సుభవల్లి నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 30 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో కోర్టు లైజనింగ్‌ అధికారులుగా ఎస్‌ఐ విఠల్‌, కానిస్టేబుల్‌ కృష్ణగౌడ్‌, సీడీఓ నాగరాజు సహకరించారు.

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం

బాలికను గుర్తించి, కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారిపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!