ఓటరు దరఖాస్తుల పరిష్కారం, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 27 :
మెదక్ జిల్లా (26) ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఓటరు దరఖాస్తుల పరిష్కారం, సంబంధిత రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియ పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశానికి మెదక్ సమీకృత కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని నోటీసులపై చర్యలను వచ్చే వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనర్హులుగా గుర్తించిన ఓటర్లకు సంబంధించిన వివరాలను తగిన ఆధారాలతో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుల విషయంలో కారణాలను వివరంగా పేర్కొంటూ తప్పనిసరిగా స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేయాలని తెలిపారు.
ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తులను నవంబర్ 5వ తేదీలోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు తమ కార్యాలయాల్లో ఎస్‌ఐఆర్–2026కు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించి, భద్రపరచాలని ఆదేశించారు. అలాగే, శాసనమండలి నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. ఫారం–18 దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన నివేదికను పత్రికలు, ప్రసార మాధ్యమాలకు అందించడంతో పాటు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు, నియమిత అధికారుల కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత ఎన్నికల అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

