అనువైన పాఠశాల భవనాల గుర్తింపునకు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశాలు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20:
మెదక్ జిల్లా (19) జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని తాత్కాలికంగా ప్రారంభించేందుకు అనువైన పాఠశాల భవనాలను గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కేంద్రీయ విద్యాలయ డిప్యూటీ కమిషనర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఎ.ఎ. ఇజ్రాయెల్, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యా వసతులను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఇటీవల కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయని తెలిపారు. మెదక్ జిల్లాలో నూతన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు హవేలీ ఘనపూర్ మండలంలోని వై.పి.ఆర్. ఇంజినీరింగ్ కళాశాల పరిసర ప్రాంతంలో 6 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. నూతన కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం పూర్తయ్యే వరకు విద్యార్థులకు విద్యా సేవలు అందించేందుకు తాత్కాలికంగా పాఠశాల నిర్వహించేందుకు అనువైన భవన సముదాయాలను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అనువైన భవనాన్ని గుర్తించిన అనంతరం తాత్కాలిక కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేలా చర్యలు చేపడతామని తెలిపారు.
నూతన భవన నిర్మాణం పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని కొత్త భవనాల్లోకి తరలించే విధంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు మెదక్ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక నిర్వహణకు అనువైన భవనాలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, గణాంక అధికారి నవీన్, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

