A2 న్యూస్, జూన్ 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా: రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. రైతులు యూరియా యాప్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకుని, నిర్ణీత సమయానికి డీలర్ల వద్ద నుంచి ఎరువును పొందాలని సూచించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, యూరియా కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామని తెలిపారు. రైతులు ఇంటి వద్ద నుంచే యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకుని, తమ అవసరానికి అనుగుణంగా సమయానికి డీలర్ల వద్ద నుంచి తీసుకోవచ్చన్నారు. దీంతో యూరియా కోసం భారీ క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్ డీలర్లు మరియు మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో కలిపి 6,300 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. ప్రతి మండలంలో రెండు నుంచి మూడు డీలర్ పాయింట్ల వద్ద యూరియా నిల్వలు ఉంచి రైతులకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రైతులు సమన్వయంతో వ్యవహరించాలని, ఎలాంటి అపోహలకు లోనుకావద్దని సూచించారు. అదేవిధంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా రైతు సేవా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఐకేపీ రైతు సేవా కేంద్రాల్లో విక్రయించే వ్యవసాయ ఇన్‌పుట్‌లకు సంబంధించిన లైసెన్సులను దుకాణాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులపై పూర్తి సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నకిలీ, నాసిరకం ఉత్పత్తులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారదర్శక సేవల ద్వారా రైతుల విశ్వాసాన్ని పొందాలని సూచించారు. వ్యవసాయ రంగ అభివృద్ధిలో రైతు సేవా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, రైతులకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు తోడ్పడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.

