Tuesday, August 4, 2026
Homeమెదక్బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాది

బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాది

📰 Generate e-Paper Clip

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 4:

మెదక్ (3 ) జిల్లా కేంద్రం, ఆగస్టు 4: ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి తల్లి తన బిడ్డకు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించడం అత్యంత అవసరమని తెలిపారు. తల్లిపాలు శిశువుకు సురక్షితమైనవి, స్వచ్ఛమైనవి, సంపూర్ణ పోషక విలువలు కలిగినవని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన శిశువు ఎదుగుదలకు, బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాదిగా నిలుస్తాయని అన్నారు. ప్రతి శిశువుకు కనీసం తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే అందించాలని, అవసరాన్ని బట్టి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు. తల్లిపాలు అందించడం ప్రతి బిడ్డ హక్కు అని, ప్రతి తల్లి తన మాతృత్వ బాధ్యతను గుర్తించి పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని కోరారు. తల్లులు తీసుకునే పోషకాహారం ద్వారానే నాణ్యమైన తల్లిపాలు శిశువులకు అందుతాయని, దీంతో పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదుగుతారని తెలిపారు. బలమైన బాల్యానికి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా తల్లులను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని తల్లులందరికీ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి హేమ భార్గవి, డీసీహెచ్‌ఎస్ శివదయాల్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, ఏఎంఓ రాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గణేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!