A2 న్యూస్, జూన్ 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
గస్తీ, నాకాబందీలతో నేర నియంత్రణకు చర్యలు
రామాయంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
మెదక్, 18: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడంతో పాటు నేర నియంత్రణకు గస్తీ, నాకాబందీలను మరింత ముమ్మరం చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం రామాయంపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణ, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా దర్యాప్తులో ఉన్న కేసులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ-సాక్ష్య యాప్ ద్వారా సంఘటన స్థలంలోని డిజిటల్ ఆధారాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో సకాలంలో నమోదు చేసి నవీకరించాలని అధికారులను ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, రాత్రి గస్తీలు, వాహనాల తనిఖీలు, నాకాబందీలను క్రమం తప్పకుండా నిర్వహించి నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలాగే స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందిస్తూ పోలీసు శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ తనిఖీలో సీఐలు సైదా, సందీప్ రెడ్డి, ఎస్‌ఐ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

