విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, జూన్ 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా :(17) అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు మరింత బలోపేతం కావాలని, వయస్సుకు అనుగుణంగా విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ డీఆర్‌డీఓ, డీఈఓ, డీడబ్ల్యూఓ, గ్రామ సర్పంచ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో ముచ్చటించి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అంగన్వాడీలు, ప్రీ-స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు తదితర అవసరాలను పూర్తిస్థాయిలో కల్పించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
అంగన్వాడీలు, ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల వయస్సును బట్టి అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల్లో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, ఏఎంఓ సుదర్శన్ మూర్తి, ఎంఈఓ తారా సింగ్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

