చివరి దశకు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు
మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియ గత సంవత్సరం కంటే మరింత సమర్థవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని పేర్కొన్నారు.జిల్లాలో ఏర్పాటు చేసిన మొత్తం 415 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తిచేసి ముగించడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 90,669 మంది రైతుల నుంచి 4,01,033.440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 73,429 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.786.06 కోట్లను జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన రైతులకు కూడా త్వరితగతిన చెల్లింపులు పూర్తి చేసే చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.వర్షాల కారణంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన టార్ఫాలిన్‌లు, రవాణా వాహనాలు మరియు ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ధాన్యం రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని, మిల్లుల వద్ద త్వరితగతిన దిగుమతి జరిగేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రతిమా సింగ్ హామీ ఇచ్చారు.

