ఆదిలాబాద్ : జిల్లాలో యాసంగి సీజన్ 2025-26 కు గాను మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధరకు శనగ పంటను విక్రయించిన రైతులకు నిధుల చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జిల్లా వ్యవసాయ శాఖ నివేదికను అనుసరించి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మొత్తం 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగల సేకరణ చేపట్టామన్నారు. జిల్లాలోని 5,813 మంది రైతుల నుండి క్వింటాళ్‌కు రూ. 5,875/- మద్దతు ధర చొప్పున, మొత్తం 1.18 లక్షల క్వింటాళ్ల శనగలను కొనుగోలు చేశామని, వీటి మొత్తం విలువ రూ. 69.33 కోట్లు అని ఆయన వివరించారు.
ఈ కొనుగోళ్లకు సంబంధించి నిధులను విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి విడత కింద రూ. 64.12 కోట్లను మార్క్ ఫెడ్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లా కార్యాలయానికి విడుదల చేయగా, ఆ మొత్తాన్ని ఆర్.టి.జి.ఎస్, నెఫ్ట్ ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన మిగిలిన బకాయిల్లో రూ. 5.19 కోట్లు నిన్న (12.06.2026 న) మార్క్ ఫెడ్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లా కార్యాలయానికి చేరాయని, ఈ నిధులను ఈరోజు (13.06.2026 న) రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి ఇంకా రావాల్సిన మిగిలిన రూ. 2.67 లక్షల స్వల్ప బకాయిలు సైతం త్వరలోనే విడుదలవుతాయని, అవి అందిన వెంటనే లబ్ధిదారులైన రైతులకు చెల్లింపులు జరుపుతామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని శనగ రైతులందరూ ఈ విషయాన్ని గమనించాలని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

