A2న్యూస్, జులై 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (8) భూ భారతి చట్టంలోని నిబంధనలు, రెవెన్యూ చట్టాలపై ప్రతి రెవెన్యూ అధికారి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులకు భూ భారతి చట్టంపై శిక్షణ, అవగాహనతో పాటు విధి నిర్వహణ బాధ్యతలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డుల నిర్వహణ, భూమి హక్కుల రికార్డు (ఆర్‌ఓఆర్), వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వారసత్వంగా సంక్రమించిన భూముల మ్యూటేషన్, ఇతర మార్గాల ద్వారా పొందిన భూముల మ్యూటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీతో పాటు వివిధ రెవెన్యూ సేవలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భూ భారతి చట్టంలోని ముఖ్యమైన సెక్షన్లను వివరించిన ఆమె పటం, ప్రాథమిక భూ సమాచారం, నీరు, ఇసుక, ఇతర మైనింగ్ కార్యకలాపాల నియంత్రణ, కులం, ఆదాయం, నివాసం, లోకల్ ఏరియా తదితర ధ్రువీకరణ పత్రాల మంజూరులో విచారణ నివేదికలను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా రూపొందించాలని తెలిపారు.
విధి నిర్వహణ సమయంలో మ్యాపులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, సెత్వార్, ఖస్రా వంటి భూ రికార్డులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా అసాధారణ సంఘటనలు సంభవించినప్పుడు స్థానికంగా ఉండి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. శిఖం భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను నివారించేందుకు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రెవెన్యూ చట్టాలపై సమగ్ర అవగాహనతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలసత్వానికి తావులేకుండా నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, రెవెన్యూ చట్టాల్లోని సెక్షన్లపై పూర్తి పట్టుండాలని తెలిపారు. ఏవైనా సందేహాలు తలెత్తితే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. గ్రామసభల్లో నిర్వహించిన భూ భారతి సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని కోరారు.శిక్షకుడు భూమి సునీల్ భూ భారతి చట్టంలోని ముఖ్యాంశాలను వివరించి, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్, ల్యాండ్ సర్వే ఏడీ కిషన్, ఆర్డీవోలు రమాదేవి, రామకృష్ణ, బవయ్య, ట్రైనీ ఆర్డీవో మహమ్మద్ అహ్మద్, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

