Saturday, August 1, 2026
Homeమెదక్బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి.. ఆపరేషన్ ముస్కాన్‌లో నెల రోజుల్లో 112 మంది బాలల రక్షణ

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి.. ఆపరేషన్ ముస్కాన్‌లో నెల రోజుల్లో 112 మంది బాలల రక్షణ

📰 Generate e-Paper Clip

75 కేసులు నమోదు.. బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు: మెదక్ అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1:

మెదక్ జిల్లా (31)బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, బాలల భవిష్యత్తు కోసం సమాజమంతా బాధ్యతగా వ్యవహరించాలని మెదక్ అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం మెదక్ జిల్లాలో నెల రోజుల పాటు విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల కార్మికుల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి రక్షించినట్లు తెలిపారు. రక్షించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరుపరిచి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం వారికి లేదా సంరక్షణ కేంద్రాలకు అప్పగించినట్లు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 112 మంది బాలలను రక్షించగా, బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 75 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. పిల్లల బాల్యం చదువుకు అంకితం కావాలని, వారు కార్మికులుగా కాకుండా విద్యను అభ్యసించి ఉన్నత భవిష్యత్తును నిర్మించుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.పోలీస్ శాఖతో పాటు కార్మిక, విద్య, మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల సమిష్టి కృషితో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే సమన్వయంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నిరంతరం చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. మెదక్ జిల్లా పోలీస్ శాఖ బాలల బంగారు భవిష్యత్తు కోసం అన్ని శాఖలతో కలిసి నిరంతరం పనిచేస్తుందని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఐ రాజశేఖర్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు ఉప్పలయ్య, వైద్యశాఖ డాక్టర్ నవ్య (సీఏఎస్), డీసీపీయూ ఇన్‌చార్జి నాగరాజు, ఏఎల్‌ఓ మెదక్ కమ్రుద్దీన్, తిరుపతి, ఏఎల్‌ఓ నర్సాపూర్ సత్యేంద్ర ప్రసాద్, మిషన్ ఎన్జీవో ప్రతినిధులు, రెండు డివిజన్లకు చెందిన ఆపరేషన్ ముస్కాన్ బృందాల సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!