A2న్యూస్, జులై 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (25) రాష్ట్రవ్యాప్తంగా జలసిరి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్‌తో కలిసి అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జలసిరి కార్యక్రమం, విబిజీ రామ్‌జీ పనులు, గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాలపై సమీక్షించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా జలసిరి కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. “ప్రతి ఇంటికి ఇంకుడు గుంత – ప్రతి పంటకు పంటకుంట – ప్రతి ఊరికి ఊటకుంట” అనే నినాదంతో భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి రైతు తన పొలంలో ఫామ్‌పాండ్ నిర్మించుకునేలా అధికారులు చొరవ చూపాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
విబిజీ రామ్‌జీ కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో తెలంగాణ దేశంలోనే ముందువరుసలో నిలిచిందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కూలీకి ఉపాధి హామీ పనిదినాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

