A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2:
మెదక్ (1) జిల్లాలో దివ్యాంగులకు సంబంధించిన యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నగేష్ అధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో యూడీఐడీ కార్డుల జారీ పురోగతి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల కుట్టింపు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న కొత్త పింఛన్ల పంపిణీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో యూడీఐడీ దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉండకుండా సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును వేగంగా పరిశీలించి అర్హులకు యూడీఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల కుట్టింపు పనులను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న యూడీఐడీ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును సకాలంలో పరిశీలించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 2025 మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,523 యూడీఐడీ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం 13 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిని కూడా ప్రత్యేక దృష్టితో త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, అడిషనల్ డీఆర్‌డీఓ సరస్వతి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మెప్మా పీడీ హనుమంత్ రెడ్డి తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

