A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2:
మెదక్ (1) పరిశుభ్రత అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరి దైనందిన బాధ్యత అని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫటీగ్ డ్యూటీలో భాగంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది స్టేషన్ ఆవరణలు, కార్యాలయ పరిసరాలు, రికార్డు గదులు, సందర్శకులు వేచి ఉండే ప్రదేశాలు, పార్కింగ్ ప్రాంతాలను శుభ్రపరిచారు. అలాగే కార్యాలయాల్లోని ఫైళ్లు, రికార్డులను క్రమబద్ధీకరించి 5S విధానం (వర్గీకరించండి, క్రమబద్ధీకరించండి, శుభ్రపరచండి, ప్రమాణీకరించండి, నిలబెట్టండి) ను అమలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి, ఇప్పటికే ఉన్న మొక్కలకు నీరు పోసి వాటి సంరక్షణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పరిశుభ్రమైన, క్రమబద్ధమైన పోలీస్ స్టేషన్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వేగవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఫటీగ్ డ్యూటీలో భాగంగా చేపట్టే పరిశుభ్రత కార్యక్రమాలు, రికార్డుల క్రమబద్ధీకరణ, 5S విధానం అమలు వల్ల కార్యాలయాల పనితీరు మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో, క్రమశిక్షణతో నిర్వహించడం బాధ్యతగా భావించాలని ఎస్పీ సూచించారు. అలాగే పరిశుభ్రతను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ, కార్యాలయ రికార్డులు, ఫైళ్లను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలని, మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన కార్యాలయ వాతావరణం ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

