ప్రాణదానంతో సమానం రక్తదానం.. 108 మంది స్వచ్ఛందంగా రక్తదానం
రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 29 :
మెదక్ జిల్లా (28) పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రభుత్వ ఆసుపత్రి సహకారంతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ శిబిరంలో ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 108 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ప్రాణాలు కాపాడేందుకు రక్తదాతలు ముందుకు రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. ఒకరు చేసే రక్తదానం ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణదానంగా మారుతుందని పేర్కొన్నారు. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ కోరారు. శిబిరాన్ని విజయవంతం చేసిన రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగనాథ్, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్‌ఐలు రామకృష్ణ, శైలేందర్, ఎస్‌ఐలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా చైర్మన్ తిరుమలేష్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

