మనోహరాబాద్‌లో 113 మంది రక్తదానం.. పోలీసుల ఆధ్వర్యంలో విజయవంతం
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 29 :
మనోహరాబాద్ (28) రక్తదానం ప్రాణదానంతో సమానమని చాటుతూ, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచేందుకు మనోహరాబాద్ పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మనోహరాబాద్‌లోని శుభం ఫంక్షన్ హాల్‌లో ఎస్సై సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 113 మంది రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్, డీఎస్పీ నరేందర్, సీఐ వెంకటరాజ గౌడ్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువకులు, స్వచ్ఛంద సేవకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటంతో పాటు బాధిత కుటుంబాలకు భరోసా కల్పించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని, అవసరమైన వారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శిబిరాన్ని విజయవంతం చేసిన ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, యువకులు, రక్తదాతలు, సహకరించిన ప్రతి ఒక్కరికీ మనోహరాబాద్ పోలీసుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

