న్యాయమూర్తి ఎం.హేమలత
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 29 :
నర్సాపూర్ (28) బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్‌పర్సన్ ఎం.హేమలత అన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ నేతృత్వంలో నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్‌పర్సన్ ఎం.హేమలత మాట్లాడుతూ బాలల హక్కులు, భద్రత, రక్షణ, సంక్షేమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాల, బాలికలు భయం లేకుండా సురక్షిత వాతావరణంలో జీవిస్తూ విద్యనుఅభ్యసించడంతోపాటు తమ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు కలిగి ఉన్నారనితెలిపారు.బాల, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి నేరాలకు పోక్సో చట్టం ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బాలలపై జరిగే హింస, వేధింపులు, లైంగిక దోపిడీ, ఇతర అనుచిత చర్యలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రత, లైంగిక వేధింపుల నివారణ, ఆన్‌లైన్ భద్రత, బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు.బాలల భద్రత కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేకాదని,ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాలల హక్కులను గౌరవిస్తూ వారికి సురక్షితమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు దుశ్చర్యలకు దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలని, చదువుపై పట్టుదలతో దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని న్యాయమూర్తి ఎం.హేమలత సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయురాలు కె.శిల్ప, ఉపాధ్యాయులు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

