Thursday, October 15, 2026
Homeమెదక్వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

📰 Generate e-Paper Clip

600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు..

నిమజ్జన వాహనాలపై ప్రత్యేక నిఘా

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 25:

మెదక్ జిల్లా (24) వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు మెదక్ జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. నిమజ్జన బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి మెదక్ పట్టణంలోని హెచ్‌ కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, చెరువుల వద్ద నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని, నిమజ్జన వాహనాలు నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నిమజ్జన వాహనాల డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు.

చెరువుల వద్ద ప్రత్యేక భద్రత

నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించేలా అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కొంటూర్ చెరువు వద్ద గజ ఈతగాళ్లు, అత్యవసర స్పందనా సిబ్బంది, ఫైర్ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు సందీప్ రెడ్డి, మహేష్, కృష్ణమూర్తి, రేణుక, శైలందర్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!