ఐఫోన్, రూ.10 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు భద్రంగా తిరిగి అప్పగింత
పోలీసు సిబ్బంది శ్రీకాంత్, భూపాల్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 25 :
మెదక్ జిల్లా (24)విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతను చాటుకున్న పోలీసు సిబ్బంది పోగొట్టుకున్న బ్యాగును సురక్షితంగా యజమానికి అప్పగించారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది శ్రీకాంత్, భూపాల్‌కు శనివారం ఆలయ గోపురం వద్ద ఒక నల్లటి బ్యాగు దొరికింది. బ్యాగును పరిశీలించగా అందులో ఒక ఐఫోన్, రూ.10 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బ్యాగును భద్రపరిచి, ఆలయ ఈఓ కార్యాలయానికి తీసుకెళ్లి యజమాని కోసం వేచి చూశారు. ఈ క్రమంలో కూకట్‌పల్లికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడికి చేరుకుని తన బ్యాగు పోయిందని తెలిపాడు. బ్యాగులోని వస్తువుల వివరాలను అడిగి నిర్ధారించుకున్న అనంతరం, ఆలయ ఈఓ సమక్షంలో బ్యాగును యజమానికి అప్పగించారు. దొరికిన విలువైన వస్తువులను భద్రంగా ఉంచి, వాటిని యజమానికి తిరిగి అందించిన పోలీసు సిబ్బంది శ్రీకాంత్, భూపాల్ నిజాయితీని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ ప్రజలకు పోలీసు శాఖపై నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఈ సందర్భంగా సూచించారు.

