Wednesday, September 23, 2026
Homeమెదక్సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధం

సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధం

📰 Generate e-Paper Clip

మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు అల్పాహారం సరఫరా

త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి — జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23:

మెదక్ జిల్లా (22)ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలులో భాగంగా మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కిచెన్‌లో ఏర్పాటు చేసిన వివిధ యంత్రాలు, సామగ్రిని పరిశీలించి వాటి పనితీరు, సామర్థ్యం, నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కిచెన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

30 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం

ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 395 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 30 వేల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

విద్యార్థులకు పౌష్టికమైన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యపై మరింత శ్రద్ధ పెరుగుతుందని, ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెరగడానికి దోహదపడుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మెదక్ కిచెన్ ప్లాంట్ మేనేజర్ పునీత్ త్రిపాఠి, హెచ్‌కేఎం ట్రస్ట్ ఆర్గనైజర్ వీర, డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ నవీన్, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం బ్రేక్‌ఫాస్ట్ ఇన్‌చార్జ్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!