ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సరైన వివరాలే ఇవ్వాలి: జిల్లా కలెక్టర్
A2 న్యూస్, జూన్ 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ :19, జిల్లాలోని ఓటర్లు ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్లు 17, 18, 31 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, సెక్షన్–17 ప్రకారం ఏ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటరు జాబితాల్లో పేరు నమోదు చేసుకునేందుకు అర్హుడు కాదన్నారు. అలాగే సెక్షన్–18 ప్రకారం ఒకే నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో ఒకటి కంటే ఎక్కువ సార్లు పేరు నమోదు చేయించుకోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అదేవిధంగా సెక్షన్–31 ప్రకారం ఓటరు జాబితా తయారీ, సవరణ, దిద్దుబాట్లు, పేర్ల చేర్పు లేదా తొలగింపులకు సంబంధించి తప్పుడు సమాచారం అందించడం, అసత్య ప్రకటనలు చేయడం లేదా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించడం శిక్షార్హమైన నేరమని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి ఒక సంవత్సరం వరకు కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్ – స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో జిల్లాలోని అర్హులైన ఓటర్లు చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ కోరారు. బూత్ లెవల్ అధికారులు అందించే దరఖాస్తు ఫారాలను సక్రమంగా నింపి సమర్పించాలని సూచించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్లు 17, 18, 31 అమలులో ఉన్నందున ఓటర్లు తమ వివరాలను నమోదు చేసే సమయంలో పూర్తి జాగ్రత్తలు పాటించి, సరైన సమాచారాన్ని మాత్రమే అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ విజ్ఞప్తి చేశారు.

