Sunday, June 21, 2026
Homeమెదక్ప్రతి అడుగులోనూ నాన్న చూపిన మార్గమే...

ప్రతి అడుగులోనూ నాన్న చూపిన మార్గమే…

📰 Generate e-Paper Clip

జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు భావోద్వేగ నివాళి

A2 న్యూస్, జూన్ 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ 20: జీవితంలో తాను సాధించిన ప్రతి విజయానికి తన తండ్రి కొండల్రావు గారే ప్రేరణ అని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన భావోద్వేగంగా తన అనుభూతులను పంచుకున్నారు. “నా ప్రతి అడుగు, నా ఎదుగుదలలో మా నాన్న పాత్ర మరువలేనిది. పెద్దగా ఆర్థిక స్థోమత లేకపోయినా, విద్యే పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి అనే నమ్మకంతో ముగ్గురు పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివించి ఉన్నత స్థానాలకు చేర్చారు. నేడు మేము జీవితంలో స్థిరపడగలిగామంటే అది ఆయన త్యాగం, కృషి, విలువలు, క్రమశిక్షణల ఫలితమే” అని ఎస్పీ తెలిపారు. తన తండ్రి గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యార్థులకు, పిల్లలకు ఎంతో ఓర్పుతో బోధించేవారని చెప్పారు. లెక్కల్లో సందేహాలు వచ్చిన ప్రతిసారీ వివరించడమే కాకుండా, జీవితంలో ఎలా ఆలోచించాలి, ఎలా ముందుకు సాగాలనే విషయాలను కూడా నేర్పించారని గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచే అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించేలా బలమైన పునాది వేశారని పేర్కొన్నారు. తాను రాసిన గ్రూప్స్ పరీక్షలో గణితంలో 150 మార్కులకు గాను 149 మార్కులు సాధించడం వెనుక తండ్రి అందించిన శిక్షణే ప్రధాన కారణమని తెలిపారు. పరీక్షలు, ఇంటర్వ్యూల సమయంలో తాను ఆందోళన చెందుతుంటే, “నువ్వు కష్టపడ్డావు… విజయం తప్పకుండా నీదే” అంటూ ధైర్యం చెప్పిన తండ్రి మాటలు తనలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపాయని అన్నారు. తాను గ్రూప్-1 అధికారిగా ఎంపికైన రోజు తండ్రి ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకమని పేర్కొన్నారు. నేడు తాను వేసే ప్రతి అడుగులోనూ ఆయన చూపిన మార్గదర్శకత్వం, నేర్పిన విలువలు, క్రమశిక్షణే దిక్సూచిగా నిలుస్తున్నాయని చెప్పారు. అయితే తన హృదయంలో ఎప్పటికీ తీరని ఒక బాధ ఉందని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ప్రజలకు సేవ చేస్తున్న దృశ్యాన్ని తన తండ్రి కళ్లారా చూడలేకపోయారని, తన కొడుకు జిల్లా ఎస్పీ అయ్యాడనే గర్వంతో ఆయన చిరునవ్వును మరోసారి చూడలేకపోయాననే లోటు ఇప్పటికీ కలిచివేస్తుందని భావోద్వేగానికి గురయ్యారు. “ఆయన భౌతికంగా నాతో లేకపోయినా, ఆయన ఆశీస్సులు నా వెన్నంటే ఉన్నాయి. ఆయన నేర్పిన విలువలు నా ప్రతి నిర్ణయంలో కనిపిస్తాయి. నేను వేసే ప్రతి మంచి అడుగు, నేను సాధించే ప్రతి విజయం మా నాన్నకు అంకితమే” అని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!