50 వేల జరిమానా విధించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి : మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
A2న్యూస్, జులై 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (21)చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, చట్టవిరుద్ధ కంటెంట్‌ను ప్రచారం చేసిన కేసులో తూప్రాన్‌కు చెందిన అరిగే శివకుమార్ (20)కు పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. తూప్రాన్ పట్టణానికి చెందిన శివకుమార్ డిగ్రీ చదువుతున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను షేర్ చేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, ఒక వ్యక్తి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి ఇతరులకు అశ్లీల కంటెంట్ పంపుతున్నట్లు గుర్తించారు. అనంతరం సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో ఐపీ అడ్రస్‌తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించారు. ఈ మేరకు తూప్రాన్ ఎస్‌ఐ శివానందం 2026 మే 12న కేసు నమోదు చేయగా, అప్పటి తూప్రాన్ సీఐ రంగకృష్ణ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సుభావాలి నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించారు. ఈ కేసులో లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీఓ నాగరాజు కీలకంగా వ్యవహరించారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థంగా దర్యాప్తు నిర్వహించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూడడం, నిల్వ ఉంచడం, షేర్ చేయడం లేదా సర్క్యులేట్ చేయడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలని, అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను ప్రచారం చేసే వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి కేసులు నమోదు చేసి, న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.

