Tuesday, September 15, 2026
Homeమెదక్వన మహోత్సవ లక్ష్యాలను సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలి

వన మహోత్సవ లక్ష్యాలను సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లాలో 60.83 శాతం లక్ష్యం పూర్తి — మంత్రి కొండా సురేఖ

A2న్యూస్,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)ఆగస్టు 25 :

మెదక్ జిల్లా (24) వన మహోత్సవంలో భాగంగా జిల్లాలకు నిర్దేశించిన మొక్కల నాటే లక్ష్యాలను సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఎఫ్‌ఓ జో.జి.తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 9.06 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. రేపు అన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో సామూహిక మొక్కల నాటే కార్యక్రమాలను నిర్వహించి, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలని సూచించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, రానున్న రోజుల్లో అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి ఆదేశించారు. ప్రతి మండలం, గ్రామం, పట్టణ ప్రాంతానికి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.

మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ కూడా కీలకం

మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ, మనుగడపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని, వాటి మనుగడను ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. చనిపోయిన మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలు నాటాలని, నాణ్యమైన మొక్కలను మాత్రమే వినియోగించాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి మొక్కలు నాటడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్రీని ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు. దేవాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల్లో ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని సూచించారు. బ్లాక్ ప్లాంటేషన్ ప్రాంతాల్లో నీటి సౌకర్యం కల్పించాలని, వన మహోత్సవానికి విస్తృత ప్రచారం కల్పించి మీడియాను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.

మెదక్‌లో 60.83 శాతం లక్ష్యం పూర్తి

మెదక్ జిల్లాలో వన మహోత్సవం కింద 31 లక్షల 95 వేల మొక్కలు నాటాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 19 లక్షల 43 వేల 654 మొక్కలు నాటి 60.83 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.మంత్రి సూచనల మేరకు రేపు జిల్లావ్యాప్తంగా భారీ స్థాయిలో సామూహిక మొక్కల నాటే కార్యక్రమాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. వన మహోత్సవంలో అన్ని వర్గాల ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేసి, జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎఫ్‌ఓ జో.జి.తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!