ఆగస్టు 27న గ్రామ, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 25 :
మెదక్, జిల్లా (24) ఆగస్టు 25: రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆగస్టు 27న గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను నిబంధనల మేరకు పకడ్బందీగా చేపడుతున్నామని వివరించారు.
ఆగస్టు 27న నిర్వహించనున్న గ్రామ సభలు, వార్డు సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సభల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, ఓటర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో అర్హత కలిగిన ప్రతి ఓటరుకు ఓటు హక్కు పరిరక్షించే విధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ గఫార్‌తో పాటు ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

