A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 25:
మెదక్ జిల్లా (24) కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆగస్టు 31లోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఏర్పాటు అంశంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రత్యేక ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగిస్తున్న ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను తొలగించి, టీ-ఫైబర్ సేవలను వినియోగంలోకి తీసుకురావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. టీ-ఫైబర్ సేవల ఏర్పాటుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. మొదటి దశలో కలెక్టరేట్లోని అన్ని శాఖలతో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకువచ్చేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, అవసరమైన సామర్థ్యం తదితర అంశాలపై సమగ్ర అంచనాలను రూపొందించి, అందుకు అనుగుణంగా టీ-ఫైబర్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఆగస్టు 31లోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఏర్పాటు పూర్తయ్యేలా ఆయా శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి సహకరించాలని ఆమె ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఈడీఎం సందీప్, టీ-ఫైబర్ మెదక్ జోనల్ మేనేజర్ ఈశ్వర్, టీ-ఫైబర్ డీఈ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

