Thursday, September 17, 2026
Homeమెదక్భూ రీ-సర్వేను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలి

భూ రీ-సర్వేను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

– భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్

A2న్యూస్, జులై 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (3) రాష్ట్రంలో చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా, నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, ఏడి ల్యాండ్ సర్వే కిషన్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, లైసెన్స్ సర్వేయర్లతో జిల్లాలో భూ రీ-సర్వే, భూభారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో రీ-సర్వే కోసం ఎంపిక చేసిన 24 గ్రామాల్లో ఇప్పటికే 7 గ్రామాల్లో సర్వే పూర్తైందని, 18 గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెదక్ జిల్లా సమర్థవంతంగా పనులు నిర్వహిస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు చిత్తశుద్ధితో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను నిబంధనల మేరకు పరిష్కరించి సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు పేద, నిజమైన భూ లబ్ధిదారులకు న్యాయం జరిగేలా రీ-సర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు. రీ-సర్వేకు అవసరమైన పరికరాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచుతామని, భూముల సరిహద్దులు స్పష్టంగా గుర్తించేందుకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్ పి ఎం) నంబర్లను కొత్తగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేసి సరిహద్దు వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ సేవలు, మ్యుటేషన్ ప్రక్రియలు పారదర్శకంగా, జాప్యం లేకుండా అందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 134 గ్రామాల్లో రీ-సర్వే పూర్తైందని తెలిపారు. గ్రామసభలను నిర్ణయించిన తేదీల్లోనే నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయరాదని ఆదేశించారు. భూ సర్వేలో బౌండరీ ఫిక్సింగ్, ప్రభుత్వ భూములు, గ్రామకంఠం అంశాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని పేర్కొన్నారు. 1946 తర్వాత సమగ్ర భూ సర్వే జరగలేదని, అందుకే నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనాలు వారానికోసారి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏడి ల్యాండ్ సర్వే కిషన్‌ను ఆదేశించారు. అనంతరం సాదా బైనామా, భూభారతి పెండింగ్ దరఖాస్తులపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించి, కట్-ఆఫ్ తేదీ నిర్ణయించి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతోందని, అత్యంత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, రీ-సర్వే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో పనిచేస్తోందని, కమిషనర్ సూచనల మేరకు పనుల వేగాన్ని మరింత పెంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!