జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించాలి: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1:
మెదక్ జిల్లా (31) ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులు తదితర అంశాలపై ఫిర్యాదులు అందజేశారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిగణించి, విచారణ పురోగతిని ఫిర్యాదుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

