అనుమానాస్పద సమాచారం వెంటనే పోలీసులకు అందించాలి: హవేళీఘనపూర్ ఎస్‌ఐ సత్యనారాయణ
A2న్యూస్ జులై 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
హవేళీఘనపూర్ (3) మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా హవేళీఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్ధన గ్రామంలో శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ డాగ్ ‘జూబి’ సహాయంతో గ్రామంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, పాన్ షాపులు తదితర అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల విక్రయం, నిల్వ, రవాణాను అరికట్టే లక్ష్యంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే స్థానిక పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. హవేళీఘనపూర్ ఎస్‌ఐ సత్యనారాయణ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్, నిషేధిత పొగాకు ఉత్పత్తులు లేదా ఇతర మాదక ద్రవ్యాల విక్రయం, నిల్వ, రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దుకాణదారులు నిషేధిత వస్తువుల విక్రయానికి దూరంగా ఉండాలని, చట్టాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిసినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, జిల్లాలో ఇటువంటి ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో హవేళీఘనపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, నార్కోటిక్ డాగ్ హ్యాండ్లర్ శ్రావణ్ పాల్గొన్నారు.

