రాష్ట్ర పోలీసు అధికారులతో డీజీపీ సి.వి. ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్
A2 న్యూస్, జులై 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (3) సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులతో ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక అంశాలపై సమీక్ష చేపట్టారు. మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కేసుల దర్యాప్తు పురోగతి, కేసుల వివరాల ఆన్‌లైన్ నమోదు, సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణ, ఈ-సాక్ష్య పోర్టల్ వినియోగం, ఇంటి వద్ద నుంచే కేసుల నమోదు, డయల్-100 కాల్స్‌పై స్పందన, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలు, నేరస్థులకు శిక్షలు పడేలా తీసుకోవాల్సిన చర్యలు, కోర్టులతో సమన్వయం తదితర అంశాలపై డీజీపీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో ప్రతి పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పెండింగ్ కేసులు లేకుండా దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని, డయల్-100కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 14 కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడేలా పోలీసులు విజయవంతంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శివంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించిన కేసును డీజీపీ ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి సీఐ శ్రీధర్, ప్రస్తుత దర్యాప్తు అధికారి వెంకట రాజా గౌడ్లను డీజీపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్య జరిగిన వెంటనే శాస్త్రీయ ఆధారాలను సేకరించడం, సాక్షుల వాంగ్మూలాలను పకడ్బందీగా నమోదు చేయడం, కోర్టు విచారణలో సాక్షులను సమర్థవంతంగా సిద్ధం చేయడం వల్ల నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడేలా చేయగలిగినట్లు అధికారులు వివరించారు. ఈ కేసును విజయవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి, ప్రస్తుత దర్యాప్తు అధికారులను డీజీపీ సి.వి. ఆనంద్ అభినందించారు.

