A2న్యూస్, జులై 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (4) మెదక్ జిల్లాలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 81వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అదనపు కలెక్టర్ నగేష్… తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య త్యాగం చిరస్మరణీయమని అన్నారు.
యువత దొడ్డి కొమరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, డీపీఓ యాదయ్య, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, డీఈఓ రాజు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

