గుంతలమయమైన రహదారితో ప్రజలకు అవస్థలు.. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఏఈ
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి రాము ఆగస్టు 13:
చేగుంట (12) చేగుంట మండలం పులిమామిడి–నార్లపూర్ మధ్య అధ్వానంగా మారిన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని పులిమామిడి గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు అధికారులను కోరారు. ఈ మేరకు బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత ఏఈ, డీఈఓ, ఈఈ అధికారులను కలిసి రహదారి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో గ్రామ ప్రజలు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచ్, వార్డు సభ్యులు అధికారులను విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రహదారి అభివృద్ధికి అవసరమైన చర్యలను త్వరితగతిన చేపట్టాలని కోరారు. వారి వినతిపై స్పందించిన ఏఈ త్వరలోనే రహదారి మరమ్మతు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మద్దూరి రాజు, వార్డు సభ్యులు మంగలి లక్ష్మణ్, తోయేటి కృష్ణ, బండ్ల వేణు, గొర్రె శ్రీహరి, చింతకింది బాలెల్లం తదితరులు పాల్గొన్నారు.

