Tuesday, July 28, 2026
Homeమెదక్బాలికల భద్రతకు ‘పోలీస్‌ అక్క’ అండ.. ప్రతి విద్యార్థినికి భరోసా: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

బాలికల భద్రతకు ‘పోలీస్‌ అక్క’ అండ.. ప్రతి విద్యార్థినికి భరోసా: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, జూలై 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (25) విద్యార్థినుల భద్రతకు పోలీస్‌ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి విద్యార్థినికి అండగా ‘పోలీస్‌ అక్క’ నిలుస్తుందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. పెద్ద శంకరంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ‘పోలీస్‌ అక్క’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విద్యార్థినులు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా ‘పోలీస్‌ అక్క’ను సంప్రదించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. విద్యార్థినుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ‘పోలీస్‌ అక్క’లు నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. మహిళల భద్రత, సైబర్‌ నేరాలు, ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళా రక్షణ చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. పెద్ద శంకరంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధికి కానిస్టేబుల్‌ గౌతమిని ‘పోలీస్‌ అక్క’గా నియమించినట్లు వెల్లడించారు. విద్యార్థినులకు ఆమె ఫోన్‌ నంబర్‌ను అందజేసి, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా భయం లేకుండా నేరుగా లేదా ఫోన్‌ ద్వారా సంప్రదించాలని సూచించారు. వారి సమస్యలను గోప్యంగా ఉంచి, అవసరమైన సహాయం అందించడంతో పాటు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సోషల్‌ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం పంచుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌–112, షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని, సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘పోలీస్‌ అక్క’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తూ వారితో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలు, భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకుని అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా దాచిపెట్టకుండా వెంటనే ‘పోలీస్‌ అక్క’కు తెలియజేయాలని, విద్యార్థినుల భద్రతకు పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐలు రేణుక, సందీప్‌రెడ్డి, ఎస్‌ఐలు శంకర్‌, ప్రవీణ్‌రెడ్డి, పోచయ్య, ‘పోలీస్‌ అక్క’ గౌతమి, పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!