A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 28:
సిద్దిపేట (27) జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం (27-07-2026) దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం, ఎంపీఆర్డీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఒకే దివ్యాంగుడికి జూపిటర్ స్కూటీతో పాటు బిజినెస్ ఆటో మంజూరు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన తాడెం లింగంకు గత ఆరు నెలల క్రితం హుస్నాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా జూపిటర్ స్కూటీ అందజేయగా, ఇటీవల జిల్లా సంక్షేమ శాఖ (డీడబ్ల్యూ) అధికారుల ద్వారా మరోసారి బిజినెస్ ఆటో మంజూరు చేశారని తెలిపారు. జిల్లాలో అనేక మంది అర్హులైన దివ్యాంగులు వాహనాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఒకే వ్యక్తికి రెండు వాహనాలు ఇవ్వడం వల్ల మిగతా అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆరోపించారు. ప్రజావాణి కార్యక్రమం రద్దు కావడంతో సంబంధిత అధికారికి వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏ దివ్యాంగునికైనా అన్యాయం జరిగితే దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం, ఎంపీఆర్డీ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని హెచ్చరించారు.

