Tuesday, July 28, 2026
Homeమెదక్వరి వద్దు.. ఆరుతడి పంటలే వేయండి

వరి వద్దు.. ఆరుతడి పంటలే వేయండి

📰 Generate e-Paper Clip

ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంతో రైతులు అధిక ఆదాయం పొందాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 28:

కౌడిపల్లి,(27) ప్రస్తుత ఎల్‌నినో (వర్షాభావ) పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధిక నీటి అవసరమున్న వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను రైతులు విస్తృతంగా సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విత్తన మేళాలను రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళాను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి రైతులతో ముచ్చటించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి, ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. “నాణ్యమైన విత్తనం – అధిక దిగుబడికి పునాది” అనే లక్ష్యంతో ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ఒకే వేదికపై సరసమైన ధరలకు అందుబాటులో ఉంచిందన్నారు. రైతులు తమ సమీప రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాలకు హాజరై వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాల మేరకు తమ ప్రాంతానికి అనువైన పంటలను ఎంపిక చేసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు, కూరగాయల సాగు, పశుసంవర్ధక రంగాన్ని అనుసంధానం చేస్తే రైతులకు ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం లభిస్తుందని వివరించారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు. కూరగాయల సాగుతో పలువురు రైతులు మంచి లాభాలు పొందుతున్నారని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యానవన పంటలను సాగు చేస్తే ఆదాయం మరింత పెరుగుతుందని తెలిపారు. పశుసంపద అభివృద్ధికి అవసరమైన మేత పంటల సాగుపై ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యానవన పంటలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. డ్రిప్ ఇరిగేషన్, నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు సకాలంలో అందేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో నాణ్యమైన విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, రైతులకు అవసరమైన ప్రతి విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. జిల్లాలోని రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ పంటలపై మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను కోరారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే విత్తన మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించి విత్తనాల నాణ్యత, సరఫరా ఏర్పాట్లపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!