A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై: 28
మెదక్ జిల్లా (27) జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల సమస్యలను అధికారులు సానుకూల దృక్పథంతో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హమైన వాటికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావాణిలో భూ భారతి సంబంధిత 37, పెన్షన్లకు సంబంధించిన 4, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన 7, ఇతర సమస్యలకు సంబంధించిన 34 దరఖాస్తులు అందాయి. మొత్తం 82 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత గడువులో పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు.

