A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 29:
మెదక్ జిల్లా (28) మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం 99 శాతం పూర్తయిందని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. ఈ విజయానికి కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, గ్రామస్థాయి కార్యకర్తలు, స్థానిక నాయకత్వం సమిష్టిగా చేసిన కృషే కారణమని ఆయన పేర్కొన్నారు. మెదక్ పట్టణంలోని మంజీరా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అధ్యక్షతన ఎస్‌ఐఆర్ కార్యక్రమ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, మండల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ఇంకా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయని అర్హులైన ఓటర్లు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. అవసరమైన సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో విశేషంగా శ్రమించిన 278 మంది బీఎల్‌ఏలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున మొత్తం రూ.14 లక్షల ప్రోత్సాహక నగదును ఎమ్మెల్యే అందజేశారు. ఇది వారి సేవలకు గుర్తింపుగా అందిస్తున్న చిన్న ప్రోత్సాహకమని పేర్కొన్నారు. అదేవిధంగా, తమ తమ మండలాల్లో 100 శాతం ఎస్‌ఐఆర్ పూర్తి చేసిన ఇద్దరు బీఎల్‌ఏలను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభం నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ బీఎల్‌ఏలు, మండల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో నిరంతర సమన్వయం కొనసాగించడంతోనే ఈ విజయాన్ని సాధించగలిగామని అన్నారు. సమావేశంలో స్థానిక కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. గంగాధర్, పార్టీ ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో మిగిలిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.

