Thursday, July 30, 2026
Homeమెదక్వ్యవసాయ సాంకేతికత వైపు ప్రభుత్వం అడుగులు

వ్యవసాయ సాంకేతికత వైపు ప్రభుత్వం అడుగులు

📰 Generate e-Paper Clip

రైతు నేస్తం’తో రైతాంగానికి ఆధునిక వ్యవసాయంపై అవగాహన: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 29:

రామాయంపేట (28) వ్యవసాయాన్ని సులభతరం చేసి లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతు వేదికలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలు, ఉద్యానవన పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. నేల స్వభావం, నీటి లభ్యత, దిగుబడి, మార్కెట్ అవకాశాలను పరిశీలించి పంటలను ఎంపిక చేసుకోవాలని, ప్రతి రైతు తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని సూచించారు. అవసరానికి మించి రసాయన ఎరువులు వినియోగించవద్దని హెచ్చరించారు.“రైతు నేస్తం’ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యవసాయ సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో రైతులకు పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ రైతుల మధ్య ఉండి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పలువురు రైతులు తాము అమలు చేసిన పంట మార్పిడి విధానాలు, వాటి ద్వారా పొందిన ప్రయోజనాలను మంత్రితో పంచుకున్నారు. అనంతరం పలువురు ఆదర్శ రైతులను మంత్రి సన్మానించారు.

రామాయంపేట రైతు వేదికలో కలెక్టర్ ప్రతిమా సింగ్

రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక నుంచి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ సంబంధిత అనేక అంశాలపై విస్తృత అవగాహన కలుగుతోందని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని రైతులకు సూచించారు.జిల్లాలో కోతుల సమస్య నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికారులు త్వరలో ఆదిలాబాద్ జిల్లాను సందర్శించి అక్కడ అమలు చేస్తున్న కోతుల నియంత్రణ విధానాలను అధ్యయనం చేసి, మెదక్ జిల్లాలో కూడా సమర్థవంతమైన ప్రణాళికను అమలు చేస్తామని వెల్లడించారు. అనంతరం ఉత్తమ రైతులు, వ్యవసాయ అధికారులను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!