A2న్యూస్, జూలై 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రామయంపేట (25) విద్యకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే స్థాయి విద్యను అందుకునేలా పటిష్ట చర్యలు చేపడుతున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శనివారం రామాయంపేట పట్టణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా పాఠశాల నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించి, నిర్మాణ విధానాలు, పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసేలా అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రూపుదిద్దుకుంటోందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సూచించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల సంఖ్యను పెంచి, పటిష్ట ప్రణాళికతో అత్యున్నత నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్య మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఈ డబ్ల్యూ ఐ డి సి) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, రామాయంపేట తహసీల్దార్ రజని, సీఎంఓ రాజు, గణాంక అధికారి నవీన్, మెగా ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆంజనేయులు, ఏఈ సఫీ తదితర అధికారులు పాల్గొన్నారు.

