వినాయక నిమజ్జనాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 18:
మెదక్ జిల్లా (17) వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. నిమజ్జన కార్యక్రమాలకు వెళ్లే సమయంలో పిల్లలను చెరువులు, బావులు, కాలువలు, ఇతర నీటి వనరుల వద్దకు ఒంటరిగా వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జన ప్రదేశాల్లో పిల్లలను ఎప్పటికప్పుడు తమ వెంట ఉంచుకోవాలని, నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూడాలని ఎస్పీ సూచించారు. ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగవద్దని, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి వెళ్లకుండా భద్రతా నిబంధనలు పాటించాలని తెలిపారు. అదేవిధంగా వినాయక శోభాయాత్రలో పాల్గొనే భక్తులు పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు. వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపివేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు కోరారు. పండుగ వేడుకల్లో ఉత్సాహంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

