పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. బ్లాక్ స్పాట్లను గుర్తించాలి
ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 18:
మెదక్ జిల్లా (17) రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులతో రోడ్డు భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారులపై పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్లపై అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రహదారి భద్రతకు సంబంధించిన అంశాలపై శాఖల మధ్య సమన్వయం పెంచుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనాలను నిర్ణీత వేగ పరిమితిలో నడపాలని కోరారు. వేగం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్, రవాణా, రోడ్లు-భవనాలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

