డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 30:
మెదక్ జిల్లా (29)జిల్లాను జీరో యాక్సిడెంట్ జోన్గా తీర్చిదిద్దడంతో పాటు మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని, మాదకద్రవ్యాల వినియోగం చట్టరీత్యా నేరమని తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎంహెచ్ఓ గణేశ్వర్, పోలీస్, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

