Friday, October 30, 2026
Homeమెదక్ఇంటర్ జోనల్ టీ20 క్రికెట్ టోర్నీలో మెదక్ పోలీసుల జయకేతనం

ఇంటర్ జోనల్ టీ20 క్రికెట్ టోర్నీలో మెదక్ పోలీసుల జయకేతనం

📰 Generate e-Paper Clip

ఫైనల్లో సిరిసిల్లపై 56 పరుగుల తేడాతో ఘన విజయం – విజేత జట్టుకు ఎస్పీ ఘన సన్మానం

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 30 :

మెదక్ జిల్లా: కరీంనగర్‌లో నిర్వహించిన ఇంటర్ జోనల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో మెదక్ జిల్లా పోలీస్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో సిరిసిల్ల పోలీస్ జట్టుపై 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా విజేత జట్టు సభ్యులను శుక్రవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ టోర్నమెంట్‌లో మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు చెందిన పోలీస్ జట్లు పాల్గొన్నాయి. తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన మెదక్ జట్టు సమష్టి కృషి, పట్టుదలతో అద్భుత ఆటతీరును ప్రదర్శించింది. టోర్నీ ఆద్యంతం ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఫైనల్‌కు చేరుకుంది. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించి సిరిసిల్ల జట్టును ఓడించి విజేతగా అవతరించింది.

టోర్నమెంట్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి మొత్తం 295 పరుగులు సాధించిన మెదక్ జట్టు క్రీడాకారుడు సాయి లాటి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నారు. జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్‌తో పాటు అద్భుత బ్యాటింగ్‌తో రాణించిన సాయి లాటిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జట్టులోని మిగతా సభ్యులను కూడా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. క్రీడలు పోలీసుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, సమష్టి కృషి వంటి లక్షణాలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి మెదక్ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు మహేష్, వెంకట రాజా గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!