డ్రగ్స్, సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలి: మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
రామాయంపేటలో రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు ప్రారంభం – బ్యాడ్మింటన్ విజేతలకు బహుమతుల ప్రదానం – పోలీస్ కానిస్టేబుల్ ప్రసాద్ రూపొందించిన అవగాహన పాటల ఆవిష్కరణ
A2న్యూస్, మెదక్ జిల్లా/రామయంపేట ప్రతినిధి (రాము)అక్టోబర్ 30 :
రామాయంపేట: రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటం ఎంతో గొప్ప సేవ అని, రక్తదాతలు మరొకరికి ప్రాణదానం చేసిన దేవుళ్లతో సమానమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రామాయంపేటలో లయన్స్ క్లబ్, తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో, రామాయంపేట సర్కిల్ పోలీసుల సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం అందించి విలువైన ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని, యువత సేవాభావంతో రక్తదాన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం రామాయంపేట పోలీసులు నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన క్రీడాకారులకు ఎస్పీ బహుమతులు అందజేశారు. అలాగే షీ టీమ్స్ అవగాహన, సైబర్ భద్రత అంశాలపై పోలీస్ కానిస్టేబుల్ ప్రసాద్ రచించిన పాటలను ఆవిష్కరించి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
మెదక్ జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తుల చేతిలో 14 మంది పోలీసులు అమరులయ్యారని ఎస్పీ గుర్తుచేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
డ్రగ్స్, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో డ్రగ్స్, సైబర్ నేరాలు ముఖ్యమైనవని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి బారినపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, సందేశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐ సైదా, ఎస్సైలు బాలరాజు, రాజేష్, శివానందం, చైతన్య కుమార్ రెడ్డి, సృజన, పోలీసు సిబ్బంది, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ సభ్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

