ప్రత్యేక కార్యదర్శి గంగాధర్
పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు.. పటిష్ట చర్యలు: కలెక్టర్ ప్రతిమాసింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 30 :
మెదక్ జిల్లా (29) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి గంగాధర్ ప్రశంసించారు. శనివారం మెదక్ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధ్యక్షతన రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులతో ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలతో భూసేకరణకు సంబంధించిన పురోగతి, అవార్డుల ప్రక్రియ, రైతులకు పరిహారం చెల్లింపులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ ప్రక్రియపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా మెదక్ జిల్లాకు వచ్చామని పేర్కొన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెదక్ జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో భూసేకరణ ప్రక్రియ మంచి పురోగతిలో ఉందని అభినందించారు. అవార్డు పాసైన భూములను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు రైతులకు పరిహారం సకాలంలో అందేలా తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రెవెన్యూ, నేషనల్ హైవే శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో భూసేకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవార్డు పాసైన భూములకు వెంటనే పరిహారం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తే ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణ పనులు కూడా వేగంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, భూసేకరణ కన్సల్టెంట్ సుందర్ అద్నాన్, నేషనల్ హైవే పీడీ మాధవి, నేషనల్ హైవే మేనేజర్ రాహుల్, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, తూప్రాన్ ఆర్డీవో బావయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ గఫర్, మండల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

