5 వేల జరిమానా విధించిన జిల్లా న్యాయస్థానం – కేసును సమర్థంగా విచారించిన పోలీసు అధికారులకు ఎస్పీ అభినందనలు
A2న్యూస్, జులై 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
టేక్మాల్ (8) మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని ఎల్పుగొండ గ్రామంలో కన్నతల్లిని హత్య చేసిన కేసులో నిందితుడు మోహన్ గారి సుదర్శన్‌కు జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ వివరాల ప్రకారం… సుదర్శన్ మద్యానికి బానిసై తరచూ తన భార్యను వేధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం తల్లి సత్యమ్మ వద్ద ఉంటూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తరచూ గొడవపడేవాడు. అలాగే తన భార్యను తిరిగి తీసుకురావాలని తల్లిపై ఒత్తిడి తెస్తూ దుర్భాషలాడటం, దాడులకు పాల్పడటం చేసేవాడు. ఈ క్రమంలో 2025 నవంబర్ 8 అర్ధరాత్రి మద్యం మత్తులో మరోసారి తల్లితో ఘర్షణకు దిగిన సుదర్శన్, కర్రతో ఆమె తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన సత్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ కృష్ణ కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు అధికారి అల్లాదుర్గ్ సీఐ రేణుక శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను సేకరించి దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ నిందితుడు సుదర్శన్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ సమర్థవంతంగా వాదనలు వినిపించగా, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ కృష్ణ సమన్వయంతో పనిచేశారు. తక్కువ సమయంలో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు లైజన్ అధికారులు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

